Karthika Puranam Day 05

 DAY – 05

సంపూర్ణ కార్తీక మహాపురాణము

అయిదవరోజు పారాయణము

నవమాధ్యాయము:

యమదూతల ప్రశ్నలకు చిరునగవుమోము కలవారైన విష్ణుదూతలు యిలా భాషించసాగారు, ‘ఓ యమదూతలారా! మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు? పుణ్యాత్ములెవరు? యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ విపులీకరించి చెప్పండి?’

విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలిలా సమాధానమీయసాగారు. “సూర్యచంద్రాగ్ని వాయురాకాశ గోసంధ్యలూ దశదిశా కాలాలూ, వీనిని మానవుల యొక్క పాప పుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము. ఓ విష్ణుదేవతలారా! శ్రద్ధగా వినండి – వేదమార్గాన్ని విడిచిన స్వేచ్చాచారులూ, సాధుజన బహిష్కృతులూ యమదండనార్హులు. బ్రహ్మణునీ, గురువునీ, రోగినీ పాదాలతో తాడించేవాడు – తల్లిదండ్రులతో కలహించేవాడూ, అసత్యవాదీ, జంతుహింసకుడూ, దానము చేసిన దానిని మరలా ఆశించేవాడూ, డాంబికుడూ, దయారహితుడూ, పరభార్యాసంగాముడూ, సొమ్ములను తీసుకొని పక్షాన్ని అవలంబించేవాళ్లనీ, చేసినదానాన్ని బైటపెట్టుకునే వానినీ, మిత్రద్రోహినీ, కృతఘ్నులనీ, ఇతరుల పురుష సంతతిని చూసి యేడ్చేవానినీ, కన్యాశుల్కాలతో జీవించేవానినీ, వాపీకూప తటాకాది నిర్మాణాటంకపరులనీ, తల్లిదండ్రుల శ్రాద్ధకర్మలను విడచినవానినీ, కేవలం భోజనం గురించే ఆలోచించేవానినీ, బ్రహ్మణాశ్వ గోహత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మాచేత దండించబడుతూంటారు. ఇక ఈ అజామిళుడంటారా? వీడు చేయని పాపమంటూ లేదు. బ్రహ్మణ జన్మమెత్తి, దాసీ సంగమ లోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికెలా అర్హుడు!”

యమదూతల సమాదానాన్ని విని – విష్ణుపార్షదులిలా చెప్పసాగారు.

ఓ యమదూతలారా! ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణము వలన గాని దుస్సంగమాన్ని వదలి సత్సంగమములో కలిసేవాడు, నిత్యము దైవచింతనాపరుడు, స్నాన సంధ్యా జపహోమతత్సరుడూ మీ యమలోక గమనానికి అర్హులు కారు.


ఓ యమదూతలారా! అసూయారహితులై, జపాగ్నిహోత్ర నిర్వాహకులై, సర్వ కర్మలనూ సగుణ బ్రహ్మార్పణము చేసేవారు – జలాన్నగోదాతలు. వృషోత్సర్జనా కర్తలూ యమలోకాన్ని పొందేందుకు అనర్హులు. విద్యాదాత (గురువులు), పరోపకార శీలురు, హరిపూజాప్రియులు, హరినామ జాపకులూ, వివాహ – ఉపనయనాలను చేయించే వారూ – అనాథ ప్రేత సంస్కారకర్తా – వీళ్లెవరూ మీ యమదండనల కర్హులు కారు. నిత్యము సాలగ్రామాన్ని అర్చించి, తత్తీర్థాన్ని పానము చేసే వాడూ – తులసీకాష్ఠ మాలికలను ధరించేవాడూ, వివేవాడూ – సూర్యుడు మేష – తులా – మకర సంక్రాంతులందుండగా ప్రాతఃస్నానమును ఆచరించేవాళ్లూ – వీళ్లెవరూ కూడా మీ యమలోకానికి అనర్హులు. తెలిసిగాని – తెలియకగాని హరినామ సంకీర్తనమును చేసే వాళ్లు – పాపవిముక్తులవుతారు. ఓ యమదూతలారా! ఇన్నిమాటలెందుకు? ఎవడైతే అవసానకాలంలో ఒక్కసారైనా హరినామస్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు,

నవమాధ్యాస్సమాప్త:

దశమాధ్యాయము

జనక ఉవాచ: వశిష్ఠా! ఈ  అజామిళుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వలన యిలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూత లెందుకూరుకున్నారు? వాళ్లు యమునికి యేమని విన్నవించారు. అన్నీ సవిస్తరంగా చెప్పు.


విశిష్ట ఉవాచ : నీవడిగిన ప్రశ్నలన్నింటికీ ఒక క్రమములో సమాధానాలు చెబుతాను విను. విష్ణుపారిషదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముని చేరి యిలా చెప్పసాగారు.

యమదూతల ఆరోపణము – యముని ఉపదేశము 

అయ్యా పాపాత్ముడునూ, దురాచారుడునూ, నిందిత కర్మాచరణపరుడూ అయిన అజామిళుని యందలి జీవుని తెచ్చే సమయంలో – విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి, అతనిని మానుంచి విడిపించి, తమతో వైకుంఠానికి తీసికొని వెళ్లారు. వాళ్లను యెదిరించలేక మేమిలా రిక్తహస్తులమై వచ్చాముఅని  కింకరులు చెప్పినది విని, రవంత క్రోధోద్రిక్తుడైన సమవర్తి  జ్ఞానదృష్టితో సమస్తాన్నీ అవలోకించినవాడై – కింకరులారా! కించిదపి పుణ్యవిహీనోపి – ఆ ఆజామిళుడనే పాపి, అంత్యకాలాన హరి నామస్మరణమును చేయడము వలన సమస్త  పాపాలనూ నశింపచేసుకుని, విష్ణుప్రియుడై, విష్ణుదూతల చేత తీసుకొని  పోబడ్డాడు. తెలిసి తాకినా – తెలియక తాకినా దహించవలెనను కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులనూ అగ్నిదహించునో అదే విధముగా – దుష్టాత్ములై, మహిమను తెలుసుకోలేక పోయినా – ఆ శ్రీహరి యొక్క నామస్మరణమును చేసినంత మాత్రము చేతనే వారి సమస్త పాపాలు దహించబడి పోతాయి. ఇక, భక్తిభావముతో స్మరించినవారు కేవలము కైవల్య పథగాములే అవుతారుఅంటూ సేవకులను ఎంతవరకూ చెప్పాలో అంతవరకూ మాత్రమే చెప్పి – యముడు మరింత పూర్వాలోచనా పరుడయ్యాడు.

అజామిళుని పూర్వజన్మ

అజామిళుడు అతని  పూర్వజన్మలో సౌరాష్ట్రదేశములో శివార్చకుడుగా వుండేవాడు. ఆ జన్మలో కూడా స్నానసంధ్యాచరనాది రహితుడూ, దైవేతరచిత్తుడూ, దైవద్రవ్యాపహరి అయి వుండేవాడు. బ్రహ్మణుడయివుండి కూడా ఆయుధపాణియై, దుష్టులతో స్నేహమును చేస్తూ తిరిగేవాడు. అర్చకుడయివుండీ కూడా వివిధాభరణ భూషితుడై స్వేచ్చావిహారాలు చేసేవాడు. బహుభాషియై యవ్వనములో వుండేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రహ్మణుడుండేవాడు, అతడు దరిద్రపీడితుడై- అన్నము కొరకై పట్టణములు, పల్లెలు తిరుగుతూ – యాయవార వృత్తిని అవలంబించి వున్నాడు. ఒకానొకసారి అతగాడు  తనకు లభించిన యాయవార వస్తుజాలాన్నంతటినీ మోసుకునివచ్చి భార్యను పిలిచి – చాలా  ఆకలిగా  వుంది. సత్వరమే వంటచేయి. ముందు కాసిని మంచినీళ్లియ్యి. అవి త్రాగి రవంత ఉపశాంతిని పొందుతానుఅన్నాడు. కాని, యౌవనమదాశ్రితయై వున్న ఆ యిల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించే తలపోస్తూ వుండిపోయింది. అందుకు కోపించిన భర్త, చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు.

తన  కామపుటాలోచనలకు అంతరాయమును కలిగించాడనే కోపంతో తన ముష్టితో ఘాతించింది. అడలీ-బడలీవున్న ఆ బాపడు అందుకై పరితాపంతో ఆమెనూ, గృహాన్నీ వదిలిపెట్టి గ్రామాంతరము వెళ్లి, భిక్షాటనతో బతకసాగాడు. మగడు యిల్లువదలి వెళ్లిపోవడంతో మరింత తెగించిన ఆ జారిణి – మగడు తెచ్చినవన్నీ సుష్ఠుగా మేసి, మగడిచ్చినవన్నీ అలంకరించుకుని, మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకుని, తాంబూల చర్వణము చేస్తూ – ఒకానొక రజకుని యింటికి వెళ్లి – ఆ రాత్రి తనతో సంభోగించవలసిందిగా కోరినది. కాని, నీతిమంతుడైన ఆ రజకుడు. ఆమె కోరిన తప్పుడుపనికి అంగీకరించకపోవడంతో – వారిద్దరికి వాగ్వివాదం జరిగింది. అంతటితో వాంచితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణజారిణి వీధినపడి రసికులను వెతుక్కుంటూ – పోతూ ఇతఃపూర్వం చెప్పబడిన ఈశ్వరాలయార్చకుని చూసి – సురత క్రీడలకాహ్వానించింది. బ్రహ్మణుడైన వీడు – ఆమె పరస్త్రీ అని  కూడా ఆలోచించకుండా – అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ ఆ జారిణి సద్వంశ సంజాత అయిన కారణంగా కామము చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై – భర్తను వెతుక్కుంటూ వెళ్లి బ్రతిమాలి తెచ్చుకుని అది  మొదలుగా అతని మాటలకు తు-చతప్పకుండా బ్రతుకసాగింది.


ఇటువంటి పాపాలవలన మరణానంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాల ననుభవించి, అనుభవించి – సత్యనిష్ఠుడి కొడుకైన అజామిళుడుగా జన్మించి – కార్తీక పౌర్ణమినాటి శివసందర్శనం – అంత్యకాల హరిస్మరణల పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు.


ఆనాటి శివార్చకుని జన్మలో – ఇతనితో జారత్వం నెరపిన బ్రాహ్మణ జారిణి కూడా కొంతకాలానికి మరణించి, నరకానుభవమును పొంది – కన్యాకుబ్దములోని ఛండాల గృహములో బాలికగా జన్మించింది. కాని ఆ – పిల్ల – తండ్రి గండాన పుట్టడం వలన – వాళ్లా పిల్లను అడవిలో వదలివేశారు. ఆ వనాంతర్గామియైన ఒకా బ్రహ్మణుడా బాలిక అరణ్యరోదన విని, జాలిపడి, తనతో తీసికొని వెళ్లి, తన యింటి దాసీకి పెంపకానికిచ్చాడు. ఆ దాసీదాని దగ్గర పెరిగిన ఈ పిల్లనే అనంతర కాలంలో అజామిళుడు దగ్గరకు తీసుకున్నాడు. మహారాజా! నువ్వడిగిన అజామిళుడి పూర్వగాథ ఇది. సమస్తమైన పాపములకూ హరినామా స్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు. అది సాధ్యము కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించాల్సి వుంటుంది.

జనక నరపాలా! ఎవరిజిహ్వ హరిని కీర్తించదో, ఎవరి మనసు హరి చరణాల నాశ్రయించదో, ఎవరి చెవులు, శ్రీహరి సంకీర్తనల నాలకించవో వాళ్ల  పాపాలు ఏ విధముగానూ కూడా నశించే అవకాశము లేదు. ఎవరైతే ఇతర చింతలన్నిటినీ విడిచి పెట్టి విష్ణువునే ధ్యానిస్తూ వుంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనడంలో ఏమీ సందేహము లేదు! మోక్షాసక్తులను మురహరి స్మరణ మేవిధంగా  సూక్ష్మమార్గమో – అదే విధముగా కార్తీక ధర్మాచరణమనే సూక్ష్మమార్గము కూడా  మహొత్కృష్ట పుణ్యప్రదాయినియై – పాతకాలను పారద్రోలుతుంది. పాపాలను నశింపజేసేశక్తి ఈ కార్తీక వ్రతాచరణకకు మాత్రమే  వుండడము వలన, ఎవరైతే ఈ దివ్వవ్రతాన్ని ఆచరించరో, వాళ్లు నరక ప్రాప్తులవుతారని తెల్సుకో. పాపనాశనియైన ఈ కార్తీక మహత్మ్యన్ని శ్రద్దా భక్తులతో వినినప్పటికీ కూడా – వారు మోక్షార్హులే అవుతున్నారు. ఆసక్తులైనవారికి – పావన హృదయంతో యీ మహత్మ్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు.

ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే

నవమ, దశమ అధ్యాయౌ సమాప్తా (తొమ్మిది, పది అధ్యాయములు)

అయిదవరోజు పారాయణము సమాప్తము

5 వ రోజు 

నిషిద్ధములు :- పులుపుతో కూడినవి 

దానములు :- స్వయంపాకం, విసనకర్ర 

పూజించాల్సిన దైవము :- ఆదిశేషుడు 

జపించాల్సిన మంత్రము :- (మంత్రం అలభ్యం, ప్రాణాయామం చేయాలి)

ఫలితము :- కీర్తి

Neeradi

Share
Published by
Neeradi

Recent Posts

Telugu Love Quotes in English

మనుసులో ఉన్నా భావాలను & ప్రేమ అభిమానాలను సరళమైన పదాలతో తెలియపరుచుతూ కొన్ని Telugu Love Quotes ఇక్కడ ఉన్నాయి,…

3 months ago

Happy Ugadi 2024 Wishes Status & images in Telugu

Happy Ugadi 2024 మన రెండు తెలుగు రాష్ట్రం లో  చైత్రమాసం ప్రారంభమైన రోజున ఉగాదిని జరుపుకుంటారు  ఈ సంవత్సరం…

3 months ago

Best 100+ Happy Christmas Wishes HD Images 2024

Happy Christmas is when Christians celebrate the birth of Jesus Christ. Christians all over the…

2 years ago

200 Best Good Morning Quotes

Everyone wants every day of their life to continue happily, and every Good Morning to…

2 years ago

Lord Shiva Top 10 Heart-Touching Quotes About Shiva Story

మూడో కన్నును తెరవరా ముక్కంటీ ఈశ్వరా మునిజనుల రక్షించరా ముక్కంటీ పరమేశ్వరా ముష్కరుల తుదముట్టించరా మూషికుని ప్రియహరా దివిని భువిని…

2 years ago

Happy Children’s Day 50 Best Quotes Hd wishes Images Greetings

Happy children's day  Children's Day 2022: Quotes Children’s day is not only for children, this…

2 years ago