Karthika Puranam Day 04

DAY-04

సంపూర్ణ కార్తీక మహాపురాణము
నాలుగవ రోజు పారాయణము
సప్తమాధ్యాయము:-

ఓ జనక రాజేంద్రా! కల్మషఘ్నమైన కార్తీక మహాత్మ్యంలో పుష్పార్చనా- దీప విధానాలను చెబుతాను విను.

పుష్పార్చనా ఫలదాన దీపవిధి – విశేషములు:-

ఈ కార్తీక మాసములో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించటం వలన  కమలాసనియైన లక్ష్మిదేవి ఆ భక్తుల యిండ్ల స్ధిరావాస మేర్పరచుకుంటుంది. తులసీ దళాలతోగాని, జాజిపువ్వులతోగాని, మారేడు దళాలతో గాని పూజించేవారు తిరిగి యీ  భూమిపై జన్మించరు. ఎవరైతే ఈ కార్తీకములో భక్తియుతులైన పండ్లను దానము చేస్తారో వారి పాపాలు  సూర్యోదయానికి చీకట్లవలె చెదరిపోతాయి. ఉసిరిచెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని తేరిజూడడానికి యమునికి కూడా శక్తి చాలదు. కార్తీకములో ఎవరైతే సాలగ్రామాన్ని తులసీదళాలతో పూజిస్తారో, వారికి మించిన ధన్యులెవరూ  ఉండరనడం అతిశయోక్తి కాదు.

బ్రాహ్మణ సమేతులై, ఉసిరిచెట్టు వున్న తోటలో – వనభోజనమును చేసేవారి మహాపాతకాలు సైతము మట్టిగలసిపోతాయి. బ్రాహ్మణ సమేతులై ఉసిరిచెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువువలె ఆనందిస్తారు. ఎవరైతే కార్తీక మాసములో  విష్ణ్వాలయములో మామిడాకుల తోరణం కడతారో, వాళ్లు పరమపదాన్ని పొందుతారు. పువ్వులతోగాని, అరటి స్తంభాలతో గాని మండపము కట్టినవాళ్లు వైకుంఠములో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండప్రణామమును చేసిన వాళ్లు అశ్వమేథ పుణ్యవంతులవుతారు. విష్ణువున కెదురుగా జప, హొమ దేవతార్చనలు చేసే వాళ్లు పితరులతో సహా వైకుంఠానికి వెళ్లి సుఖిస్తారు. స్నానము చేసి తడిబట్టలతోనున్న వానికి పొడిబట్టని దానము చేసిన వాడు పదివేల అశ్వమేథాల ఫలాన్ని పొందుతాడు. ఆలయ శిఖరముపై ధ్వజారోహణము చేసిన వారి పాపాలు గాలికి –  పుష్పము  పరాగమువలె యెగిరిపోతాయి. నల్లని లేదా తెల్లని అవిసెపూలతో హరిపూజను చేసిన వారికి పదివేల యజ్ఞాల ఫలితము ప్రాప్తిస్తుంది.

కార్తీకమాసమందు యే స్త్రీ అయితే బృందావనాన గోమయంతో అలికి, పంచరంగులతోనూ, శంఖ- పద్మ- స్వస్తికాదిరంగ వల్లులను తీరుస్తుందో ఆమె విష్ణువుకు ప్రియురాలవుతుంది. విష్ణు సన్నిధిలో నందా దీపాన్ని ఆర్పించడం వలన కలిగే పుణ్యాన్ని వేయినోళ్ల అదిశేషుడైనా పొగడలేడు. ఈ కార్తీకమాసములో శివుని జిల్లేడుపూలతో పూజించినవాడు దీర్ఘయువై, అంత్యాన మోక్షాన్ని పొందుతాడు. విష్ణ్వాలయములో మండపాన్ని అలంకరించినవారు హరి మందిరములో చిరస్దాయిగా వుంటారు. హరిని మల్లెపువ్వులతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమై పోతాయి. తులసీ గంధముతో సాలగ్రామ పూజను చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణు సన్నిధిలో నాట్యమును చేసిన వారి యొక్క పూర్వసంచిత పాపాలన్నీ నాశనమై పోతాయి. భక్తియుక్తులై  అన్నదానమును చేసే వారి పాపాలు గాలికి మంచుతునకలలా యెగిరిపోతాయి.  ప్రత్యేకించి కార్తీక మాసములో నువ్వుల దానము, మహానదీ స్నానము, బ్రహ్మపత్ర భోజనము,  అన్నదానము ఈ నాలుగూ ఆచరించడం ధర్మముగా చెప్పబడుతూ వుంది. స్నాన దానాదులను నాచరింపనివారూ, లోభియై యధాశక్తిగా చేయని వారు నూరు జన్మలు కుక్కగా పుట్టి, తదుపరి నూరుపుట్టుకలూ శునకయోనిని జన్మిస్తారు.

కార్తీకమాసములో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలాన్ని భేదించుకుని స్వర్గానికి వెడతారు. పద్మాలతో పూజించినవారు చిరకాలము సూర్యమండలములోనే నివసిస్తారు. ఓ  జనక మహారాజా! కార్తీక మాసములో యెవరైతే అవిసె పువ్వుల మాలికలతో  శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గధిపతులవుతారు. మాల్యములు – తులసీదళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. ఇంకొక్క సూక్ష్మాన్ని చెబుతాను విను, అశక్తులయిన వాళ్లు.

  శ్లో || కార్తీకే భానువారేతు స్నానకర్మ సమాచరేత్ !

        మాసస్నానేన యత్సుణ్యం తత్పుణ్యం లభతేనృప !!
  శ్లో|| ఆద్యేంతియే తిథౌ మధ్యమే చ దినే యః స్నానమాచరేత్ !
      మాస స్నాన ఫలం తేన లభ్యతే నాత్ర సంశయః !!

కార్తీకమాసంలో ఆదివారం నాడు లేదా శుక్ల పాడ్యమి నాడు గాని, పూర్ణమనాడు గాని, అమావ్యానాడు గాని సంకల్పరహితముగా ప్రాతఃస్నాన మాచరించడం వలన కూడా ఆ మాసమంతా స్నానము చేసిన పుణ్యం లభిస్తుంది. ఆ పాటి శక్తి కూడా లేని వాళ్లు కార్తీకమాసము నెల రోజులూ ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా, వినినా కూడా స్నానఫలాన్ని పొందుతారు. ఇది కేవలం ఆశక్తులకే సుమా! మహీశా! కార్తీకమాసములో యితరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించేవారి పాపాలు నశించిపోతాయి. కార్తీకమాసము విష్ణుపూజార్ధమై యితరులకు సహకరించేవారు స్వర్గాన్ని పొందుతారు. తాము స్వయంగా సంకల్ప పూర్వకముగా విష్ణువును పూజించేవాళ్ళు అవ్యయ పదాన్ని పొందుతారు. కార్తీకమాసము సాయంకాలాలలో దేవాలయాలలో శివ – విష్ణుస్తోత్రాలను పఠించేవారు – కొంతకాలము స్వర్గలోకములో వుండి – అనంతరము ధ్రువలోకాన్ని పొందుతారు. ఇలా ప్రతీ! కార్తీక మాసములో యెవరైతే హరిహరులను స్మరించకుండా వుంటారో వాళ్లు ఏడుజన్మలపాటు నక్కలుగా పుడతారనడంలో ఏమీ సందేహము లేదు.

సప్తమధ్యాస్సమాప్త:-

అష్టమాధ్యాయము

వశిష్టుడు చెప్పినదంతా విని జనకుడు అడుగుతున్నాడు: మహర్షీ! మీరు చెప్పినవన్నీ వినిన తరువాత నాకొక సందేహము కలుగుతోంది. వర్ణసాంకర్యాది మహాపాపాలను చేసిన దుర్జనులు వేదత్రయోక్తాలయిన ప్రాయశ్చిత్తాలను చేసుకొననిదే పరిశుద్ధులు కారుఅని సమస్త ధర్మ శాస్త్రాలలోను ఘోషిస్తుండగా, కేవలం కార్తీక వ్రతాచరణా ధర్మలేశము చేతనే సమస్త పాపాలూ హరించుకుని పోయి వైకుంఠాన్ని పొందుతారని చెప్పడంలోని మర్మమేమిటి? ఇది యెలా సంభవం? అత్యంత స్వల్పమైన పుణ్య మాత్రము చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి? గండ్రగొడ్డళ్లతో కూడా కూలనేయ సాధ్యముగాని మహాపర్వతాన్ని కేవలము కొనవ్రేలి గోటితో కూల్చడము సాధ్యమవుతుందా? అగ్ని దగ్ధమవుతూన్న యింటిలో ఉన్నవాడు ఆ మంట మీద పురిషెడు నీళ్లు జల్లినంత మాత్రాన, అగ్ని ప్రమాదము తొలగిపోతుందా? మహానదీ ప్రవాహములోనో కొట్టుకుని పోయే వారిని ఓ పాటి గడ్డిపరక గట్టుకు చేర్చగలుగుతుందా ? తనకు తానై కొండచరియలలోని ఏ లతాసూత్రాన్నే పట్టుకున్నంత మాత్రము చేతనే నదీపాతవేగాన్నుంచి సంరక్షించబడతాడా? వశిష్ఠా! ఈ విధమైన దృష్టాంతాల రీత్యా మహాపాపులైన వాళ్లు సహితము అతి స్వల్ప కార్యమైన కార్తీక వ్రతాచరణము వలన పాపరహితులూ, పుణ్యాత్ములూ ఎలా అవుతారు ? వీటికి సమాధానమేమిటి ?
జనకుడి ప్రశ్నకు జ్ఞానహసమును చేస్తూ – ఇలా చెప్పసాగాడు వశిష్ఠుడు.
జనకుని ప్రశ్నలకు వశిష్ఠుని జవాబు
వశిష్ఠ ఉవాచ:
మంచి విమర్శే చేశావు మహారాజా! చెబుతాను విను. ధర్మాన్ని సూక్ష్మముగా చింతించాలేగాని, స్ధూలరూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు. అదిగాక, వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మసూక్ష్మాలను మనకందిస్తున్నాయి. ఆయా ధర్మసూత్రాల వలన కొన్ని పర్యాయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను – స్వల్ప పుణ్యాలు గొప్పవిగానూ పరిణమిస్తూంటాయి. ధర్మాలన్నీ గుణత్రయముతో కూడుకుని స్వల్ప నల్పతలను సిద్ధింపచేసుకుంటాయి. మూల ప్రకృతియైన మహామాయకారణంగా సత్వర జస్తమస్సులనే మూడు గుణాలు కూడా ఏర్పడ్డాయి. వీటిలో సత్వగుణ ప్రధానమైనవి ధర్మసూక్ష్మాలు. కర్మకాండ, తపస్సు, ప్రాయశ్చిత్తాలన్నీ కూడా రజోగుణం వలన ఏర్పడ్డాయి.

తర్కము- దైవేతర చింతనతో సాగించే దైవీయ కృత్యాలు, ఆచరించే దానధర్మాలు, ఇవన్నీ కూడా ధర్మము యొక్క స్ధూలస్వరూపాలు. ఇవి తమోగుణము వలన  యేర్పడతాయి. వీటిల్లో  – సత్వగుణ ప్రధానముగా ఆచరించే ధర్మాలు స్వల్పముగా తోచినప్పటికీ దేశకాలయోగ్యతాదుల వలన విశేష ఫలాలను  ఇస్తాయి. దేశముఅంటే పుణ్యక్షేత్రం, కాలము  అంటే పుణ్యకాలము. యోగ్యత అంటే – పాత్రత.  బ్రహ్మజ్ఞత కలవాళ్లు ఈ మూడింటినీ చింతించకుండా చేసే సర్వధర్మాలూ తమాసాలు – వీటివలన పాపాలు నశించవు. కాబట్టి దేశకాల  యోగ్యతలను విచారించి చేసేవే సత్వధర్మాలు. వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేవి రజోగుణ ధర్మాలని వేరే చెప్పనక్కరలేదు కదా! జనకరాజా! అన్నిటికి కర్మమే మూలము. ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలుంటాయి. అయినప్పటికి మనిషికి జ్ఞానము అనేది ఉన్నందువలన ఆచరంచే ధర్మాలను పై మూడింటితో పోల్చుకుని ప్రయత్న పూర్వకముగానైనా ఆచరించాలి. ఈ విధంగా మూడు కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మము అక్షయ ఫలితాన్నిస్తుంది. రాజా! పర్వతమంత యెత్తు కట్టెలను పేర్చి, వాటి మధ్య గురివింద గింజంత అగ్నికణాన్ని ఉంచితే -ఆ అగ్నికణము ఆ కట్టెలనెలా కాల్చివేయగలుగుతుందో, సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపము ఆ ఇంటి చీకట్లనెలా తొలగిస్తుందో, గుండిగెడు మురికినీళ్లను ఒక్క ఇండుపగింజ ఎలా శుభ్రపరుస్తుందో – అదే విధంగా తెలిసిగాని, తెలియకగాని పుణ్యకాలములో, పుణ్యక్షేత్రములో పుణ్యమూర్తుల వలన ఆచిరంచే ధర్మము అనంత పాపాలనూ దగ్ధం చేసి, మోక్షానికి మార్గాన్ని వేస్తుంది. ఇందుకుదాహరణగా ఒక కథ చెబుతాను విను.

అజామిళోపాఖ్యానము:-

బహుకాలం పూర్వం కన్యాకుబ్జక్షేత్రవాసీ, సార్ధక నామధేయుడూనైన సత్యనిష్ఠుడనే బ్రాహ్మణునికి అజామీళుడనే కుమారుడుండేవాడు. వాడు పరమ దురాచారుడు. దాసీ  సాంగత్యపరుడు,  హింసా ప్రియుడుగా వుండేవాడు. సాటి బ్రాహ్మణ గృహములోని ఒకానొక దాడితో సాంగత్యమును పెట్టుకొని, తల్లిదండ్రులను మీరి ఆ దాసీ  దానితోనే భోజన శయానాదులన్నిటినీ నిర్వర్తిస్తూ, కామాంధుడై వైదిక కర్మలన్నింటినీ విడచిపెట్టి, కేవల కామాసక్తుడై ప్రవర్తించసాగాడు. తద్వారా బంధువులంతా అతనిని వదలివేశారు. కులము వాళ్లు వెలివేశారు.  అందువలన యిల్లు వదలిపెట్టి పోవలసి వచ్చిన అజామిళుడు ఛండాలపువాడలోని ఒకానొక దాసీ దానితో కాపురము పెట్టి, కుక్కలనూ, మృగాలనూ ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తితో బతికకే జనాలలో లీనమై, మధుమాంస సేవనా లోలుడై కాలమును గడపసాగాడు. ఇలా వుండగా, ఒకనాడతని ప్రియురాలైన దాసీది, కల్లు తాగడం కోసం తాడిచెట్టునెక్కి, కమ్మ విరగడం వలన క్రిందపడి మరణించింది. అజామిళుడు అమితంగా దుఃఖించాడు.

అప్పటికే ఆ దాసీ దానికి  యవ్వనవతియైన కూతురు వుంది. మహాపాపాత్ముడూ, మహా కామాంధుడూ అయిన అజామిళుడు, తనకి కూతురు వరుసని కూడా తలచకుండా – ఆ పిల్లనే వరించి, ఆమెతోనే కామోపభాగాలనుభవించసాగాడు. కాముకుడైన అజామిళుడు, తన కూతురి యందే అనేక మంది బిడ్డలను పొందాడు. కాని వాళ్లందరూ కూడా పసికందులుగా కడతేరిపోగా, కడగాపుట్టి మిగిలిన బిడ్డకు నారాయణఅని నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు. తాను తింటున్నా, నిదురిస్తున్నా ఏం చేస్తున్నాసరే – సతతం అతనినే స్మరించుకుంటూ నారాయణా – నారాయణాఅని పిలుచుకుంటూ తన్మయుడవుతూ వుండేవాడు. కాలము గడచి అజామిళుడు కాలము చేసే సమయము ఆసన్నమైంది. అతడిలోని జీవుని తీసుకొని పోయేందుకుగాను – ఎర్రని గడ్డములు – మీసములు కలిగి, చేత దండపాశాలను ధరించిన భయంకర రూపులైన యమదూతలు వచ్చారు.

వారిని చూస్తూనే గడగడలాడి పోయిన అజామిళుడు,  ప్రాణావసాన వేళ కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక, ఎక్కడో దూరముగా స్నేహితులతో ఆటలలో మునిగి వున్న కుమారునికోసమై నారాయణా, ఓ నారాయణా! తండ్రి నారాయణా‘! అని పలుమారులు పిలవసాగాడు.

ఆ పిలుపు అతడి కొడుకుకు వినబడలేదు. అతను రానూ లేదు. కాని చేరువకు వచ్చిన యమదూతలు ఆ నారాయణనామస్మరణను విని వెనుకకు జంకారు. అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైన విష్ణుదూతలు – ఓ యమదూతలారా! అడ్డు తొలగండి. ఇతడు మాచే తీసుకొని పోబడదగినవాడేగాని, మీరు  తీసుకొని వెళ్లదగిన వాడు కాదుఅని హెచ్చరించారు. వికసిత పద్మాలవలే విశాలమైన నేత్రాలు కలవాళ్లూ, పద్మమాలాంబర వసనులూ అయిన ఆ పవిత్ర విష్ణుపారిషదులను చూసి, విభ్రాంతులైన యమదూతలు అయ్యా! మీరెవరు? యక్ష గంధర్వ సిద్ద చారణ కిన్నెర విద్యాధరులలో ఏ తెగకు చెందిన వారు? మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మము రీత్యా తీసికొని వెళ్ళనున్న ఈ జీపుని మీరెందుకు తీసికొని వెడుతున్నారు?’ అని అడగడంతో, విష్ణుదూతలులిలా చెప్పసాగారు.

ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే

  సప్తమ, అష్టమ అధ్యాయౌ, (సప్త – మాష్టమాధ్యాయములు)
  నాలుగవరోజు పారాయణము సమాప్తము)

4 వ రోజు

నిషిద్ధములు  :- వంకాయ, ఉసిరి

దానములు  :- నూనె, పెసరపప్పు

పూజించాల్సిన దైవము  :- విఘ్నేశ్వరుడు

జపించాల్సిన మంత్రము :- ఓం గం గణపతయే స్వాహా

ఫలితము :- సద్బుద్ధి, కార్యసిద్ధి 

Neeradi

Share
Published by
Neeradi

Recent Posts

Telugu Love Quotes in English

మనుసులో ఉన్నా భావాలను & ప్రేమ అభిమానాలను సరళమైన పదాలతో తెలియపరుచుతూ కొన్ని Telugu Love Quotes ఇక్కడ ఉన్నాయి,…

3 months ago

Happy Ugadi 2024 Wishes Status & images in Telugu

Happy Ugadi 2024 మన రెండు తెలుగు రాష్ట్రం లో  చైత్రమాసం ప్రారంభమైన రోజున ఉగాదిని జరుపుకుంటారు  ఈ సంవత్సరం…

3 months ago

Best 100+ Happy Christmas Wishes HD Images 2024

Happy Christmas is when Christians celebrate the birth of Jesus Christ. Christians all over the…

2 years ago

200 Best Good Morning Quotes

Everyone wants every day of their life to continue happily, and every Good Morning to…

2 years ago

Lord Shiva Top 10 Heart-Touching Quotes About Shiva Story

మూడో కన్నును తెరవరా ముక్కంటీ ఈశ్వరా మునిజనుల రక్షించరా ముక్కంటీ పరమేశ్వరా ముష్కరుల తుదముట్టించరా మూషికుని ప్రియహరా దివిని భువిని…

2 years ago

Happy Children’s Day 50 Best Quotes Hd wishes Images Greetings

Happy children's day  Children's Day 2022: Quotes Children’s day is not only for children, this…

2 years ago